అమ్మా…హమ్మమ్మా!

నా స్నేహం నువ్వే, నా ప్రియ శత్రువు నువ్వే!

గోవింద గోవిందా… కాషాయం పోయిందా … !

మా అమ్మ టైపిస్టుగా పి. ఆర్. ఓ  లో పని చేస్తుండగా యెన్. టీ. రామారావు గారు మన రాష్త్ర ( ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) ముఖ్య మంత్రి. ఆయిన ఎప్పుడు కాషాయం వేసుకునే వారు.

ఆ రోజుల్లో అమ్మ ఒక కాషాయం రంగు గుడ్డ కొని నాకు మా చెల్లికి బట్టలు కుట్టించింది. ఖర్మమా! అని మేము అవి వేలాడు తీస్కుని వెళ్ళేవాళ్ళం. బేoడు మేళం లాగా ఉండేవాళ్ళం నేను మా చెల్లి ఆ పిచ్చి బట్టలలో. అది చాలనట్టు తను ఒక ప్లైన్ చీర కొనుక్కుంది అదే రంగులో . ఆ చీర మీద చీర ఒక ప్రింటు గానీ, కుట్టు గానీ లేదు. మీకు మాకు చిత్రంగా ఉన్నా.. మా అమ్మకి ఏనాడు ఇది తేడాగా అనిపించలేదు , ఈనాటికీ!  :O

బుధవారం వచ్చిందంటే నాకు గుండెల్లో గుబులు అంటే నమ్మండి. ఇద్దరికీ ఆ బట్టలు తగిలించి బడికి పంపుతుందేమో నని టెన్షన్ గా ఉండేది నాకు. 18  ఏళ్ళు రానిదే వోటు హక్కు లేనట్టు అప్పుడు నాకు చెల్లికి బీరువా హక్కు లేదు. మా అమ్మ ఏ బట్టలు ఇస్తే అవి వేస్కుకోవలసిందే.

నేను ఊహించిన సుభ గడియ రానే వచ్చింది అమ్మ ఆ డ్రెస్ తీసి మంచం మీద పెట్టింది. నేను ఆ డ్రెస్ వేసుకోకుండా ఉండేందుకు వెధవ ఆలోచనలు మొదలెట్టాను.పెరట్లోంచి అటే పారిపోదాం అనుకునాను పోనీ జ్వరం అని చెప్పేసి ఇంట్లో కూర్చుందాం అనుకునాను. కానీ నేను పెట్టుకున్నది ‘హిట్లర్’ తో కాదు మా అమ్మ తో…

నా పన్నాగాలు పారలేదు  సరికదా, నా వేషాలకి మా అమ్మ కి కోపం కూడా వచ్చింది. అమ్మకి కోపం వస్తే ముక్కు పుటలు ఎగరేసి ‘నాగిన్’ సినిమా లో శ్రీదేవి లా కనిపిస్తుంది. కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ అమురుతాయి. అమ్రేష్ పూరి బూర ఊడుతుంటే తను బుస కొడ్తునట్టు కనిపిస్తుంది. దెబ్బకి ట్టా దొంగల మూటా! అని కిక్కురు మనకుండా అమ్మ చెప్పిన డ్రెస్ వేస్కుని బొత్తాలు పెట్టుకుని స్కూల్ కి బయలుదేరాము.

మా స్కూల్ లో చాల మావిడి చెట్లు ఉండేవి కాన్వెంట్ గోడ అవతల. వేసవి కాలం అవ్వడం తో చెట్ల నిండా మావిడి కాయలు. అవి నన్ను ఆట పట్టిస్తునట్టు ఉండేది. గబగబా చెట్లెక్కి రెండు కాయలు కోసేసను. ఎవరో వస్తునట్టు అనిపించగానే గోడ దూకేసాను. అంతే! …. నేను కింద పడటం నా డ్రెస్సు చిరాగటం రెండూ ఒకే సారి జరిగి పోయాయి. కాలు మెలిక పడి నేను లేవలేని స్థితిలో మా చెల్లి నాకు సాయం పడ్తూండగా ‘చంద్రలేక’ ఇంకో టీచర్ పేరు గుర్తు లేదు ఆ ‘వరమని’ టీచర్ ఇద్దరు వచ్చి నన్ను లేపి, తిట్టి  నా చేతిలో ఉన్న మావిడి కాయలు పట్టుకెళ్లిపోయారు. మర్నాడు ఒకళ్ళు ‘మెంతి బద్దలు’ ఇంకొకళ్ళు ‘మావిడి కాయ పప్పు’ తెచ్చారని  స్టాఫ్ రూం దగ్గర తచ్చాడుతున్న మా గూఢచారి సమాచారం.మావిడి కాయలు పోతే పోయాయి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు డ్రెస్సు చిరిగింది ఇంకా ఎప్పటికి ఈ డ్రెస్సు వేసుకోవక్కర్లేదు అని గంతులేస్తూ ఇల్లు చేరాను. మా అమ్మ చేతిలో చివాట్లు తిన్నా ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు.

అంతకు మించిన ఆనందం ఇంకో రోజు కలిగింది. మా అమ్మ ఆ కాషాయం రంగు చీరని చాల ఏళ్ళు వాడాక దానికి అమీర్పేట్ లో నల్ల పూల ప్రింటు వేయించింది. అలా కూడా ఒక దశాబ్దం పాటు కట్టుకున్నాక ఓ రోజు మడికట్టుకోవడానికని  వాకిట్లో ఆరేసింది. ఎవడో దొంగ వెధవ ఆ చీరని పట్టుకుని చక్కా పోయాడు.  ఆహా!… ఇంకా నేను ‘స్వర్ణ కమలం’ సినిమా లో ముత్య్ల్లల అరుణ చెప్పినట్టు ‘గంతులే గంతులు’!

మునిపంటితో నా సంతోషాన్ని నొక్కి పెట్టి… అయ్యో! అమ్మా! కాషాయం రంగు చీర పోయిందా! బాధ పడకు మల్లి ఇంకోటి కొనుకోవచ్చులే అన్నా! 😛

కొసమెరుపు ఏమిటంటే మా అమ్మ నా డ్రెస్ రఫ్  (పిచ్చి పిచ్చి దారాలతో చెత్త కుట్లు వేసి బట్టల మీద ఉన్న చిల్లుని దాచే ప్రక్రియ) తీయించింది …. నాకు పొట్టయ్యి నేను కట్టుకోలెంత వరుకు నేను ఆ డ్రెస్ వాడల్సివచింది!! 😦


బుజ్జి పండు

జనవరి 31, 2010 Posted by | Shortstories | , | 6 వ్యాఖ్యలు