అమ్మా…హమ్మమ్మా!

నా స్నేహం నువ్వే, నా ప్రియ శత్రువు నువ్వే!

మూడు గులాబీల కధ

రంగు రుచి చిక్కదనం … మూడు గుణాల ‘త్రీ రోజెస్’  టీ అడ్వటైజ్ మెంట్ గుర్తు ఉండని వారు తక్కువ. నా ఈ కధకి ఆ  అడ్వటైజ్మెంట్ కి ఏమీ సంభంధం లేదు .

మేము ఒక ముస్లిం ఫ్యామిలీ పైన ఇంట్లో అద్దెకి ఉంటున్న రోజులవి. వాళ్ళకి దూరపు భందువుల అమ్మాయి ‘రిజ్వాన’ వాళ్ళ ఇంట్లో ఉన్న గులాబీ మొక్క విరగ పూసేది … పెద్ద మొక్క … కొమ్మ కొమ్మకీ బోలెడు గులాబీ పువ్వులు.

మామూలుగా గులాబీ మొక్కలు ఉన్న వాళ్ళతో అందరు స్నేహం చెయ్యడానికి ప్రయత్నిస్తారు, గులాబీల మహిమ అలాంటిది మరి! కానీ ఆ చెట్టు ఉన్న వారు అందరితో స్నేహం చెయ్యరు. వారు ఎంపిక చేసుకున్న వారితోటే మాట్లాడుతారు. మా అదృష్టం కొద్దీ రిజ్వానా వాళ్ళ ‘A’ లిస్టు లో మేము ఉన్నాం. మేము( నేను మా చెల్లాయి) ఇద్దరం ఆ అమ్మాయి తో ఆడుకునే వాళ్ళం. అప్పుడప్పుడు వాళ్ళు మాకు గులాబీ పువ్వులు ఇచేవాళ్ళు. నేను, చెల్లి, మా అమ్మ ముగ్గురం ఆ పువ్వులు పెట్టుకుని ‘త్రీ రోజెస్’ లాగా ఉండేవాళ్ళం.

ఆ తరువాత ఏడాది మేము ఇల్లు మారాం. పక్కన ఉన్న వీధిలోకి. రిజ్వానా తో మా స్నేహం కాస్త కుంటు పడ్డా … పౌర్ణమికో , అమావాస్యకో ఇంక మాకు పువ్వులు ఇచ్చేవారు వాళ్ళ అమ్మగారు.

మా కొత్త ఇల్లు ఉన్న వీధిలో నాకు గులాబీ వాసన వచ్చింది. ‘ఎక్కడి నుంచీ అబ్బా?’ అని నేను నా సెన్సెస్ కి పదును పెట్టాను. అదే వీధిలో ఒక మార్వాడి ఫ్యామిలీ వాళ్ళు అన్నదమ్ములు అందరు కలిసి ఉండేవారు. వాళ్ళింట్లో ఉంది ఒక గులాబీ మొక్క! ఇది రిజ్వానా వాళ్ళ మొక్క కంటే చిన్నగా ఉన్నా ఈ చెట్టుకీ బోలెడు పువ్వులు ఉన్నాయ్. ఒక పువ్వు అడుగుదాం అని వాళ్ళ  గుమ్మం లోకి వెళ్ళాను.కానీ వాళ్ళు పొద్దునే ఆవుకి చక్కగా రెండు రోటీలు పెట్టేవారు ఆ తరువాత, ఇంట్లో వాళ్ళు ఎవరూ బయటికి వచ్చిన దాఖలాలు ఉండేవి కాదు. ఇందాక చెప్పిన ప్రిన్సిపుల్ ప్రకారం వీళ్ళ  ‘A’ లిస్టు లో నేను ఉంటేనే నాకు పువ్వులు ఇస్తారు …. వీళ్ళు  ఎవరితోటి మాట్లాడేవారు కాదు….అంటే ….నాకు వాళ్ళు పువ్వులు ఇవ్వరు.

రక్తం వాసన చూసిన పులి, గులాబీ పువ్వు వాసన చూసిన ఆడపిల్ల ఇంక ఆలస్యం చెయ్యవు.  నేను ఒక పధకం వేసుకున్నాను. ఒక మధ్యాహ్నం వేళ మా అమ్మ , నాన్నారు ఆఫీసులకి వెళ్ళాక నేను మా గేటు దూకి నెమ్మదిగా వాళ్ళ గోడ ఎక్కి మెట్ల కిందకి డేకి అక్కడ కాసేపు నక్కి అవకాసం కోసం వేచి చూసాను.

అప్పట్లో కేబుల్ టీవీ లేదు గనుక భోజనాలు కాగానే అందరు నిద్రావస్థలో ఉండేవాళ్ళు . సమయం చూసి వేటాడి మూడు పువ్వులు కోసేసి మళ్లీ గోడ దూకి ఇంట్లోకి వచ్చేసాను.  హమ్మయ్యా! ఎవరూ చూడలేదు, సాయంకాలం అమ్మతో చక్కగా జడ వేయించుకుని పువ్వులు పెట్టించుకుందాం అనుకున్నా …

ఆ వేళ సాయంకాలం మా అమ్మ మంచి మూడ్ లోనే ఉంది. ఆఫీసు నుంచీ అనుకున్న దానికంటే తొందరగానే వచ్చింది. నన్ను, చెల్లిని స్నానం చేయించి ముస్తాబు చేస్తోంది. నాన్నగారు రాగానే సినిమాకి వెళ్తున్నాం అని చెప్పింది.

అ: “బుజ్జి పండు ఈ ఫ్రిజ్ లో గులాబీ పూలు ఎక్కడివి?” కోపంగా అమ్మ

బు: “రిజ్వానా ఆంటీ ఇచ్చారమ్మా” అమాయకంగా నేను

అ: “నిజంగానే ఆంటీ ఇచ్చారా? “

బు: “అవునమ్మా!”

నాకు మా అమ్మ రెండు అవకాశాలు ఇచ్చినా నేను నిజం చెప్పలేదు, తప్పు నాదే.

నాన్నగారు వచ్చే సరికి మేము ముగ్గురం ‘త్రీ రోజెస్ ‘ గెట్-అప్ లోకి వచ్చేసాం … ఇహ సినిమాకి బయలుదేరాం …

ఆ మార్వాడి వాళ్ళ ఇల్లు దాటుతూండగా నా గుండె వేగం పెరిగి పోతోంది …. అనుకున్నదంతా అయ్యింది…

ఆవిడ కిటికీ లోంచి ఒక్క కేక వేసింది … “మీ అమ్మాయీ మాది గోడ ఎక్కి … మా గేటు ఎక్కి … మాది చెట్టు నుంచీ పువ్వుల్ కోస్కుంది …. మాది నెల అంత మట్టి లో కాలు పెట్టి తోక్కినై …. ఇదిగో చూడు … ” అని  డిటెక్టి వ్ హోమ్స్ లాగా  వాళ్ళ చెట్టు దగ్గర నుంచీ మా ఇంటి వరుకు నేను వేసిన అడుగులు  మాగ్నిఫయింగ్ లెన్స్ లో మా అమ్మకి  చూపించింది …

ఇంకెక్కడి సినిమా … తిన్నగా ఇంటికి తీస్కెళ్ళి మా అమ్మే మ్యూజిక్ కంపోజ్ చేసింది ..

ఆకాశవాణి హైదారాబాద్ కేంద్రం … మీరు కోరుకున్న పాట …యీ   కార్యక్రమ్మాన్ని మీకు సమర్పించిన వారు  ‘త్రీ రోజెస్’ రచన, సంగీతం, దర్సకత్వం  మా అమ్మ  … ప్లేబ్యాక్ సింగర్ బుజ్జి పండు “ఇంకెప్పుడూ చెయ్యనమ్మా, కొట్టకమ్మా”    కోరస్ “అమ్మా, అక్కని కొట్టద్దమా ” బై చిన్ను … “పోనిలేవే ఈ సారికి వదిలెయ్యి” బై నాన్నారు …. పాటను కోరిన వారు భారత నగరు కాలనీ నుంచీ మార్వాడి ఆంటీ అండ్ ఫ్యామిలీ … యీ ప్రసారం ఇంతటితో సమాప్తం .. నమస్కారం.

బుజ్జి పండు

ఫిబ్రవరి 2, 2010 - Posted by | Shortstories

5 వ్యాఖ్యలు »

  1. హ హ్హ హ్హా…భలే ఉందండీ మీ మూడు గులాబీల కథ 🙂 ముఖ్యంగా చివర్లో మీ పాట విత్ కోరస్ 😉 😉

    వ్యాఖ్య ద్వారా మధురవాణి | ఫిబ్రవరి 2, 2010 | స్పందించండి

  2. భలే..భలే..:)

    వ్యాఖ్య ద్వారా padmarpita | ఫిబ్రవరి 2, 2010 | స్పందించండి

  3. Super :))

    వ్యాఖ్య ద్వారా అభిజ్ఞాన | ఫిబ్రవరి 2, 2010 | స్పందించండి

  4. chala bagundi mee pata,, asalu navvu aagaledu office lo confarance lo vunnanu anna sangate marchipoyanu…

    వ్యాఖ్య ద్వారా Naveen C | ఏప్రిల్ 21, 2010 | స్పందించండి

  5. హ హ హ.. !! సూపర్ !!!

    వ్యాఖ్య ద్వారా Sujji | మే 8, 2010 | స్పందించండి


వ్యాఖ్యానించండి