అమ్మా…హమ్మమ్మా!

నా స్నేహం నువ్వే, నా ప్రియ శత్రువు నువ్వే!

పాస్ బుక్కు తెచ్చిన చిక్కు

మా అమ్మ గురించి ఇంకేదైనా వ్రాసే ముందు తన గురించి టూకీగా  :

ఇప్పుడు సహనానికి మారు రూపులా ఉంటుంది  కానీ ఒక్కప్పుడు మాకు సింహ స్వప్నం . తనకి శుభ్రత అంటే మక్కువ;  మాకు కాస్త టెక్కు ఎక్కువ. అమ్మకి కావలసింది అణకువ; కానీ నేనేమో అణు బాంబు. కాబ్బట్టి మా ఇద్దరికీ ఎప్పుడు ఫయ్టింగు. మా అమ్మ బస్సుల్లో ప్రయాణం చేసి ఇల్లు చేరే సరికి అలసిపోయి కోపం తోనే ఉండేది. దానికి తగ్గట్టు కల్లు తాగిన కోతి పిల్ల కంటే ఘోరంగా నేను చేసే అల్లరి చూసి అమ్మ కోపం తారాస్థాయికి చేరుకునేది. మట్టి లో ఆడద్దు అంటే మట్టి లోనే ఆడేసి ఇంటికి వచ్చి ‘దేభ్యం మొహం’ వేసుకుని  మా అమ్మ ముందు నుంచునే దాన్ని. మా అమ్మ దాన్ని మహాభారత్ సీరియల్ లో ‘ఆక్రమణ్’ సిగ్నల్ అనుకుని నాకు ‘బడిత’ పాటం(వత్తు ‘ట’ రాదేంటి చెప్ప్మా) నేర్పేది.

కొంత కాలం యుద్ధం లో బాగా గాయ పడ్డా, నెమ్మదిగా నేను కొన్ని టెక్కునిక్కులు నేర్చుకున్నాను

1 . ఎంత అల్లరి చేసినా అమ్మ వచ్చే సరికి అన్ని సర్దేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చోవాలి

2 . అలా ఒక వేళ కూర్చోలేక పోతే  అన్నం తింటునట్టు కంచం ముందు కూర్చోవాలి

3 . ఇవేవీ కాని పక్షం లో కనీసం స్కూలు డ్రెస్సు అయినా మార్చుకోవాలి

4 . లాస్ట్ అండ్ ఫైనల్ గా హీన పక్షం జుట్టు దువ్వుకుని హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి

ఇవి నాకు బైబుల్ లెవెల్ లో కాకా పోయిన ఆల్మోస్ట్ అదే టైపు.

ఇక యీ కధకి సంభందించిన సాయంకాలం:

మా అమ్మ ఆవేళ బయటికి వెళ్ళదు అని తేల్చి చెప్పేసింది పొద్దునే. యూనిట్ టెస్ట్లులు వస్తునాయి శ్రద్దగా చదువుకో అని ఆర్డరు జారీ చేసింది. బయటికి వెళ్ళకుండా పైన ఇంటి ‘శిరీష్’ అన్నయ్యని కాపలా పెట్టింది. వాడు నేను గేటు దాటితే కొట్టేస్తానని ఒక క్రికెట్ బ్యాటు చూపించి బెదిరించాడు.

వెంటనే నేను నలుగురు స్నేహుతులకి ప్రాణం పోసాను ఇంచు మించు పార్వతి దేవి స్టయిల్ లో. ‘వినోద్’ ‘విష్ణు’ అని  ఇద్దరు బాయిస్ ని ‘సీత’ ‘రుక్మిణి’ అని  ఇద్దరు గరల్స్ ని నేను ఆడుకోవడం కోసం సృష్టించేశాను. బ్యాంకాట ఆడుకుందాం అని నా ప్లాన్. వెంటనే నా ఫ్రెండ్స్ అందరిని తీస్కుని బ్యాంకుకి వెళ్ళాను. వాళ్ళందరికీ కొత్త అక్కౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు టూర్లు వెళ్ళడం కోసం T .A బిల్లులు రెడీ చేసేసాను. ఈ కధలో ఒక్కటే చిక్కు, నా ఫ్రెండ్స్ అయితే ఇమాజినరీ కానీ ‘బ్యాంకు పాస్ బుక్కులు’ , ‘T .A బిల్లులు’ నిజంగా మా అమ్మ , నాన్నగారి పుస్తకాలు, బిల్లులు లూనూ 🙂 ఆట అయ్యాక అన్నీ మంచం క్రింద సర్దేసి నేను నా పని లో మునిగి పోయాను.

అమ్మ ఇంట్లోకి వచ్చింది; ఏం అల్లరి చేసావ్ అంది సూటిగా నన్నే చూస్తూ. విషయం అర్థం కాలేదా? నా ప్లాన్ వర్క్- అవుట్ అవ్వాలంటే నా బైబుల్ లోంచి ఏదో ఒక్కటే పాయింటు అమలు చెయ్యాలి. ఆ రోజు బయటికి వెళ్లి మడ్డి లో ఆడలేదు కనుక నాకు బోలెడు టైం ఉండీ పక్క దులుపేసాను, అంట్లు తొలిచేసి , నేను ఎంట్రీలు వేసిన కాయితాలన్నీ పరుపు కింద దాచేసి, జుట్టు దువ్వుకుని, బట్టలు మార్చుకుని, అన్నం తింటూ నా నోటు బుక్కు చదవనారంభించాను మా అమ్మ ఇల్లు చేరే వేళ్టికి. నాలుగు స్టెప్పులు ఒకే రోజు వేస్తే మా అమ్మకే కాదు మీకు కూడా డౌట్ వస్తుంది. అదే జరిగింది. ఇవాళ మా అమ్మ కొట్టలేదు, వెరైటీ కోసం మా నాన్నగారితో నాతో చాకి రేవు పెట్టించింది. ‘బజాజ్’ ఇది బుజ్జిది అనే వాషింగ్ మెషిన్ తీసకున్నాం మేము. బుజ్జిది అంటే ‘బుజ్జి పండు’ కోసం అని నిర్ణయించుకుని మా అమ్మ పద్దు చదువుతూండగా మా నాన్న నా లెక్క సరి చూసారు

మొన్న స్టవ్ మీద పాలు ఒలక పోసేసింది  – 3

నిన్న ఫ్రిజ్ లో నీళ్ళ సీసా బద్దలు కొట్టేసింది – 2

బాయిలర్ ఆన్ చేసి వదిలేసారు -5

పక్క వాటాలో పూలు కోసేసింది -10

ఎదురుకుండా ఇంట్లో సిమెంట్ జల్లెడ దగ్గర చేరి మట్టి తినేసింది -3

ఇవాళ ఈ భాగోతం అంతా బ్లాగులోకి ఎక్కించింది – 1 ,116   😛

ఇలాంటి పిచ్చి రాతలు గీతలు ఉన్న పుస్తకాలు ఆమోదించం అని సదరు బ్యాంకు వారు ఖరాఖండి గా చెప్పడం తో మా అమ్మా, నాన్నగారు ఆ ఎకౌంటు ఓ  పదిహేను ఏళ్ళ పాటు వాడటానికి వీలు లేకుండా పోయింది. ఆ విషయం తెలిసిన రోజున కూడా నాకు ఒక మినీ  సెషన్ పెట్టారు. బ్యాంకు మేనేజర్ మారిన తరువాత ఒక రెండు ఏళ్ళ క్రితమే సెటిల్ అయ్యింది. కధ సుఖాంతం.

బుజ్జి పండు

ఫిబ్రవరి 3, 2010 Posted by | Shortstories | 3 వ్యాఖ్యలు