అమ్మా…హమ్మమ్మా!

నా స్నేహం నువ్వే, నా ప్రియ శత్రువు నువ్వే!

పాస్ బుక్కు తెచ్చిన చిక్కు

మా అమ్మ గురించి ఇంకేదైనా వ్రాసే ముందు తన గురించి టూకీగా  :

ఇప్పుడు సహనానికి మారు రూపులా ఉంటుంది  కానీ ఒక్కప్పుడు మాకు సింహ స్వప్నం . తనకి శుభ్రత అంటే మక్కువ;  మాకు కాస్త టెక్కు ఎక్కువ. అమ్మకి కావలసింది అణకువ; కానీ నేనేమో అణు బాంబు. కాబ్బట్టి మా ఇద్దరికీ ఎప్పుడు ఫయ్టింగు. మా అమ్మ బస్సుల్లో ప్రయాణం చేసి ఇల్లు చేరే సరికి అలసిపోయి కోపం తోనే ఉండేది. దానికి తగ్గట్టు కల్లు తాగిన కోతి పిల్ల కంటే ఘోరంగా నేను చేసే అల్లరి చూసి అమ్మ కోపం తారాస్థాయికి చేరుకునేది. మట్టి లో ఆడద్దు అంటే మట్టి లోనే ఆడేసి ఇంటికి వచ్చి ‘దేభ్యం మొహం’ వేసుకుని  మా అమ్మ ముందు నుంచునే దాన్ని. మా అమ్మ దాన్ని మహాభారత్ సీరియల్ లో ‘ఆక్రమణ్’ సిగ్నల్ అనుకుని నాకు ‘బడిత’ పాటం(వత్తు ‘ట’ రాదేంటి చెప్ప్మా) నేర్పేది.

కొంత కాలం యుద్ధం లో బాగా గాయ పడ్డా, నెమ్మదిగా నేను కొన్ని టెక్కునిక్కులు నేర్చుకున్నాను

1 . ఎంత అల్లరి చేసినా అమ్మ వచ్చే సరికి అన్ని సర్దేసి పుస్తకాలు ముందేసుకుని కూర్చోవాలి

2 . అలా ఒక వేళ కూర్చోలేక పోతే  అన్నం తింటునట్టు కంచం ముందు కూర్చోవాలి

3 . ఇవేవీ కాని పక్షం లో కనీసం స్కూలు డ్రెస్సు అయినా మార్చుకోవాలి

4 . లాస్ట్ అండ్ ఫైనల్ గా హీన పక్షం జుట్టు దువ్వుకుని హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి

ఇవి నాకు బైబుల్ లెవెల్ లో కాకా పోయిన ఆల్మోస్ట్ అదే టైపు.

ఇక యీ కధకి సంభందించిన సాయంకాలం:

మా అమ్మ ఆవేళ బయటికి వెళ్ళదు అని తేల్చి చెప్పేసింది పొద్దునే. యూనిట్ టెస్ట్లులు వస్తునాయి శ్రద్దగా చదువుకో అని ఆర్డరు జారీ చేసింది. బయటికి వెళ్ళకుండా పైన ఇంటి ‘శిరీష్’ అన్నయ్యని కాపలా పెట్టింది. వాడు నేను గేటు దాటితే కొట్టేస్తానని ఒక క్రికెట్ బ్యాటు చూపించి బెదిరించాడు.

వెంటనే నేను నలుగురు స్నేహుతులకి ప్రాణం పోసాను ఇంచు మించు పార్వతి దేవి స్టయిల్ లో. ‘వినోద్’ ‘విష్ణు’ అని  ఇద్దరు బాయిస్ ని ‘సీత’ ‘రుక్మిణి’ అని  ఇద్దరు గరల్స్ ని నేను ఆడుకోవడం కోసం సృష్టించేశాను. బ్యాంకాట ఆడుకుందాం అని నా ప్లాన్. వెంటనే నా ఫ్రెండ్స్ అందరిని తీస్కుని బ్యాంకుకి వెళ్ళాను. వాళ్ళందరికీ కొత్త అక్కౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు టూర్లు వెళ్ళడం కోసం T .A బిల్లులు రెడీ చేసేసాను. ఈ కధలో ఒక్కటే చిక్కు, నా ఫ్రెండ్స్ అయితే ఇమాజినరీ కానీ ‘బ్యాంకు పాస్ బుక్కులు’ , ‘T .A బిల్లులు’ నిజంగా మా అమ్మ , నాన్నగారి పుస్తకాలు, బిల్లులు లూనూ 🙂 ఆట అయ్యాక అన్నీ మంచం క్రింద సర్దేసి నేను నా పని లో మునిగి పోయాను.

అమ్మ ఇంట్లోకి వచ్చింది; ఏం అల్లరి చేసావ్ అంది సూటిగా నన్నే చూస్తూ. విషయం అర్థం కాలేదా? నా ప్లాన్ వర్క్- అవుట్ అవ్వాలంటే నా బైబుల్ లోంచి ఏదో ఒక్కటే పాయింటు అమలు చెయ్యాలి. ఆ రోజు బయటికి వెళ్లి మడ్డి లో ఆడలేదు కనుక నాకు బోలెడు టైం ఉండీ పక్క దులుపేసాను, అంట్లు తొలిచేసి , నేను ఎంట్రీలు వేసిన కాయితాలన్నీ పరుపు కింద దాచేసి, జుట్టు దువ్వుకుని, బట్టలు మార్చుకుని, అన్నం తింటూ నా నోటు బుక్కు చదవనారంభించాను మా అమ్మ ఇల్లు చేరే వేళ్టికి. నాలుగు స్టెప్పులు ఒకే రోజు వేస్తే మా అమ్మకే కాదు మీకు కూడా డౌట్ వస్తుంది. అదే జరిగింది. ఇవాళ మా అమ్మ కొట్టలేదు, వెరైటీ కోసం మా నాన్నగారితో నాతో చాకి రేవు పెట్టించింది. ‘బజాజ్’ ఇది బుజ్జిది అనే వాషింగ్ మెషిన్ తీసకున్నాం మేము. బుజ్జిది అంటే ‘బుజ్జి పండు’ కోసం అని నిర్ణయించుకుని మా అమ్మ పద్దు చదువుతూండగా మా నాన్న నా లెక్క సరి చూసారు

మొన్న స్టవ్ మీద పాలు ఒలక పోసేసింది  – 3

నిన్న ఫ్రిజ్ లో నీళ్ళ సీసా బద్దలు కొట్టేసింది – 2

బాయిలర్ ఆన్ చేసి వదిలేసారు -5

పక్క వాటాలో పూలు కోసేసింది -10

ఎదురుకుండా ఇంట్లో సిమెంట్ జల్లెడ దగ్గర చేరి మట్టి తినేసింది -3

ఇవాళ ఈ భాగోతం అంతా బ్లాగులోకి ఎక్కించింది – 1 ,116   😛

ఇలాంటి పిచ్చి రాతలు గీతలు ఉన్న పుస్తకాలు ఆమోదించం అని సదరు బ్యాంకు వారు ఖరాఖండి గా చెప్పడం తో మా అమ్మా, నాన్నగారు ఆ ఎకౌంటు ఓ  పదిహేను ఏళ్ళ పాటు వాడటానికి వీలు లేకుండా పోయింది. ఆ విషయం తెలిసిన రోజున కూడా నాకు ఒక మినీ  సెషన్ పెట్టారు. బ్యాంకు మేనేజర్ మారిన తరువాత ఒక రెండు ఏళ్ళ క్రితమే సెటిల్ అయ్యింది. కధ సుఖాంతం.

బుజ్జి పండు

ఫిబ్రవరి 3, 2010 Posted by | Shortstories | 3 వ్యాఖ్యలు

మూడు గులాబీల కధ

రంగు రుచి చిక్కదనం … మూడు గుణాల ‘త్రీ రోజెస్’  టీ అడ్వటైజ్ మెంట్ గుర్తు ఉండని వారు తక్కువ. నా ఈ కధకి ఆ  అడ్వటైజ్మెంట్ కి ఏమీ సంభంధం లేదు .

మేము ఒక ముస్లిం ఫ్యామిలీ పైన ఇంట్లో అద్దెకి ఉంటున్న రోజులవి. వాళ్ళకి దూరపు భందువుల అమ్మాయి ‘రిజ్వాన’ వాళ్ళ ఇంట్లో ఉన్న గులాబీ మొక్క విరగ పూసేది … పెద్ద మొక్క … కొమ్మ కొమ్మకీ బోలెడు గులాబీ పువ్వులు.

మామూలుగా గులాబీ మొక్కలు ఉన్న వాళ్ళతో అందరు స్నేహం చెయ్యడానికి ప్రయత్నిస్తారు, గులాబీల మహిమ అలాంటిది మరి! కానీ ఆ చెట్టు ఉన్న వారు అందరితో స్నేహం చెయ్యరు. వారు ఎంపిక చేసుకున్న వారితోటే మాట్లాడుతారు. మా అదృష్టం కొద్దీ రిజ్వానా వాళ్ళ ‘A’ లిస్టు లో మేము ఉన్నాం. మేము( నేను మా చెల్లాయి) ఇద్దరం ఆ అమ్మాయి తో ఆడుకునే వాళ్ళం. అప్పుడప్పుడు వాళ్ళు మాకు గులాబీ పువ్వులు ఇచేవాళ్ళు. నేను, చెల్లి, మా అమ్మ ముగ్గురం ఆ పువ్వులు పెట్టుకుని ‘త్రీ రోజెస్’ లాగా ఉండేవాళ్ళం.

ఆ తరువాత ఏడాది మేము ఇల్లు మారాం. పక్కన ఉన్న వీధిలోకి. రిజ్వానా తో మా స్నేహం కాస్త కుంటు పడ్డా … పౌర్ణమికో , అమావాస్యకో ఇంక మాకు పువ్వులు ఇచ్చేవారు వాళ్ళ అమ్మగారు.

మా కొత్త ఇల్లు ఉన్న వీధిలో నాకు గులాబీ వాసన వచ్చింది. ‘ఎక్కడి నుంచీ అబ్బా?’ అని నేను నా సెన్సెస్ కి పదును పెట్టాను. అదే వీధిలో ఒక మార్వాడి ఫ్యామిలీ వాళ్ళు అన్నదమ్ములు అందరు కలిసి ఉండేవారు. వాళ్ళింట్లో ఉంది ఒక గులాబీ మొక్క! ఇది రిజ్వానా వాళ్ళ మొక్క కంటే చిన్నగా ఉన్నా ఈ చెట్టుకీ బోలెడు పువ్వులు ఉన్నాయ్. ఒక పువ్వు అడుగుదాం అని వాళ్ళ  గుమ్మం లోకి వెళ్ళాను.కానీ వాళ్ళు పొద్దునే ఆవుకి చక్కగా రెండు రోటీలు పెట్టేవారు ఆ తరువాత, ఇంట్లో వాళ్ళు ఎవరూ బయటికి వచ్చిన దాఖలాలు ఉండేవి కాదు. ఇందాక చెప్పిన ప్రిన్సిపుల్ ప్రకారం వీళ్ళ  ‘A’ లిస్టు లో నేను ఉంటేనే నాకు పువ్వులు ఇస్తారు …. వీళ్ళు  ఎవరితోటి మాట్లాడేవారు కాదు….అంటే ….నాకు వాళ్ళు పువ్వులు ఇవ్వరు.

రక్తం వాసన చూసిన పులి, గులాబీ పువ్వు వాసన చూసిన ఆడపిల్ల ఇంక ఆలస్యం చెయ్యవు.  నేను ఒక పధకం వేసుకున్నాను. ఒక మధ్యాహ్నం వేళ మా అమ్మ , నాన్నారు ఆఫీసులకి వెళ్ళాక నేను మా గేటు దూకి నెమ్మదిగా వాళ్ళ గోడ ఎక్కి మెట్ల కిందకి డేకి అక్కడ కాసేపు నక్కి అవకాసం కోసం వేచి చూసాను.

అప్పట్లో కేబుల్ టీవీ లేదు గనుక భోజనాలు కాగానే అందరు నిద్రావస్థలో ఉండేవాళ్ళు . సమయం చూసి వేటాడి మూడు పువ్వులు కోసేసి మళ్లీ గోడ దూకి ఇంట్లోకి వచ్చేసాను.  హమ్మయ్యా! ఎవరూ చూడలేదు, సాయంకాలం అమ్మతో చక్కగా జడ వేయించుకుని పువ్వులు పెట్టించుకుందాం అనుకున్నా …

ఆ వేళ సాయంకాలం మా అమ్మ మంచి మూడ్ లోనే ఉంది. ఆఫీసు నుంచీ అనుకున్న దానికంటే తొందరగానే వచ్చింది. నన్ను, చెల్లిని స్నానం చేయించి ముస్తాబు చేస్తోంది. నాన్నగారు రాగానే సినిమాకి వెళ్తున్నాం అని చెప్పింది.

అ: “బుజ్జి పండు ఈ ఫ్రిజ్ లో గులాబీ పూలు ఎక్కడివి?” కోపంగా అమ్మ

బు: “రిజ్వానా ఆంటీ ఇచ్చారమ్మా” అమాయకంగా నేను

అ: “నిజంగానే ఆంటీ ఇచ్చారా? “

బు: “అవునమ్మా!”

నాకు మా అమ్మ రెండు అవకాశాలు ఇచ్చినా నేను నిజం చెప్పలేదు, తప్పు నాదే.

నాన్నగారు వచ్చే సరికి మేము ముగ్గురం ‘త్రీ రోజెస్ ‘ గెట్-అప్ లోకి వచ్చేసాం … ఇహ సినిమాకి బయలుదేరాం …

ఆ మార్వాడి వాళ్ళ ఇల్లు దాటుతూండగా నా గుండె వేగం పెరిగి పోతోంది …. అనుకున్నదంతా అయ్యింది…

ఆవిడ కిటికీ లోంచి ఒక్క కేక వేసింది … “మీ అమ్మాయీ మాది గోడ ఎక్కి … మా గేటు ఎక్కి … మాది చెట్టు నుంచీ పువ్వుల్ కోస్కుంది …. మాది నెల అంత మట్టి లో కాలు పెట్టి తోక్కినై …. ఇదిగో చూడు … ” అని  డిటెక్టి వ్ హోమ్స్ లాగా  వాళ్ళ చెట్టు దగ్గర నుంచీ మా ఇంటి వరుకు నేను వేసిన అడుగులు  మాగ్నిఫయింగ్ లెన్స్ లో మా అమ్మకి  చూపించింది …

ఇంకెక్కడి సినిమా … తిన్నగా ఇంటికి తీస్కెళ్ళి మా అమ్మే మ్యూజిక్ కంపోజ్ చేసింది ..

ఆకాశవాణి హైదారాబాద్ కేంద్రం … మీరు కోరుకున్న పాట …యీ   కార్యక్రమ్మాన్ని మీకు సమర్పించిన వారు  ‘త్రీ రోజెస్’ రచన, సంగీతం, దర్సకత్వం  మా అమ్మ  … ప్లేబ్యాక్ సింగర్ బుజ్జి పండు “ఇంకెప్పుడూ చెయ్యనమ్మా, కొట్టకమ్మా”    కోరస్ “అమ్మా, అక్కని కొట్టద్దమా ” బై చిన్ను … “పోనిలేవే ఈ సారికి వదిలెయ్యి” బై నాన్నారు …. పాటను కోరిన వారు భారత నగరు కాలనీ నుంచీ మార్వాడి ఆంటీ అండ్ ఫ్యామిలీ … యీ ప్రసారం ఇంతటితో సమాప్తం .. నమస్కారం.

బుజ్జి పండు

ఫిబ్రవరి 2, 2010 Posted by | Shortstories | 5 వ్యాఖ్యలు

నిమ్మ పండు …. రూపాయికి రెండు …

హైదరాబాద్ నగరం లో చంద్ర బాబు నాయుడు గారు ‘రైతు బజార్’ అనే మార్కెట్లు పెట్టించారు…

కూరలకని  మా అమ్మ , నాగమణి ఆంటీ కలిసి ఆ మార్కెట్ కి వెళ్ళేవారు … వీళ్ళు ఏమిటో ఒక్కళ్ళకి ఒకళ్ళు కూరగాయలు గిఫ్ట్ చేసుకునే వారు ..

సరే ఇక అసలు కధలోకి వద్దాం. రూపాయికి రెండు నిమ్మకాయలు. ఆంటీ రెండు కొనుక్కుని అమ్మకి రెండు కొనిపెట్టారు. మా అమ్మ మిగతా కూరగాయలతోపాటే ఆ నిమ్మకాయలు సంచి లో వేసుకుంది…సంచి అంటే నిజంగానే సంచీ…. గుడ్డ బ్యాగు … నిరుద్యోగ సంచి …. దానికొక చిల్లు.

ఇంటికి చేరే సరికి ఆ బ్యాగు లోంచి ఒక నిమ్మకాయ ఎక్కడో పడి పోయింది. అంతే! .. ఇంక మా అమ్మకి చాలా దు:ఖం  వచ్చేసింది. “అయ్యో! నాగమణి ఆంటీ కొనిపెట్టిన నిమ్మకాయ పడిపోయిందే ” అని వెధవ  అర్థ రూపాయి నిమ్మకాయ కోసం మా చెవులు తుప్పు వదిలే వరుకు చెప్తూనే ఉంది.

ఎప్పుడూ ఇంతే …. ఒక పచ్చిమిర్చి పోయిందనో … అరటికాయ అర ముక్క పడిపోయిందనో … కొత్తిమీర కట్టకి రెండు ఆకులు తక్కువ అయ్యాయనో  .. అరటిపళ్ళ బండి వాడి దగ్గర గుమ్మడికాయ  మర్చిపోయిందనో బాధ పడుతూ ఉండేది. ఇలా ఎవరైనా ఇచ్చినవి పోతే ఇంకా కష్టం… మన సహనం అదుపు తప్పుతుంది …

ఇంతలో మళ్ళీ మంగళవారం వచ్చింది, మళ్ళీ ‘రైతు బజార్’, మళ్ళీ మాకు హడల్ …

మా అమ్మ బాధ ఇంక చూడలేక పోయాను. అందుకే ఈ సారి ఈ కధకి  వేరే ట్విస్టు ఉన్న  క్లైమాక్స్  డిసైడ్ చేశాను. నాగమణి ఆంటీ కి కాల్ చేశాను (బ్యాగ్రౌండ్ లో .. ఏ.ఆర్ . రేహమను నాగమణి .. నాగమణి పాట వస్తోంది ..) “హలో! ఆంటీ, మీరు ఈ సారి మా అమ్మకి ఏదైనా కొనివ్వాలని అనుకుంటే , ఏ ఆవాలో , జీలకర్రో, తప్పితే గసగాసాలోకొనివ్వండి… అవైతే ఒకటి రెండు పోయినా పరవాలేదు, అమ్మ గుర్తుపట్టదు అని చెప్పేసాను” ముహాహాహా …  😀

బుజ్జి పండు

(పైన వ్రాసినది కొంత వరుకు నిజమైనా, కధలో అతిశయోక్తులు ఉన్నాయ్)

ఫిబ్రవరి 1, 2010 Posted by | Shortstories | 4 వ్యాఖ్యలు

అమ్మా! కళ్ళజోడు పెట్టుకో…

“బుజ్జి పండు, చిన్ను కొత్త కళ్ళ జోడు చూసావా? ఎంత బావుందో! చూస్తుంటే కొనుక్కుని నాక్కూడా పెట్టుకోవాలని ఉంది.” మా అమ్మ నాకు ఫోన్ లో ఈ ముక్క చెప్పిన దగ్గర నుంచీ .. నాకు నిద్ర లేదు… జరక్కూదనిది ఏదో జరగబోతోందని నా మనసు గట్టిగా చెప్తోంది …. అందుకు
కారణం తెలియాలంటే మనం కనీసం 10 సంవత్స్తరాలు వెనక్కి వెళ్ళాలి …

మా అమ్మకి కళ్ళ జోడు వచ్చి .. ఎప్పుడు రావాలో అప్పుడే వచ్చింది లెండి…. ఇప్పుడు చత్వారం, తన వయసు రెండు పుండు మీద కారం లాంటి టాప్పిక్కులు తెచ్చి … ఆల్రెడీ ….నేను కూర్చున్న చెట్టు కొమ్మని చట్టుకున నేనే నరికేసుకున్నాను …

ఇహ పోతే … మా అమ్మకి కళ్ళ జోడు వచ్చి X సంవత్స్తరాలు అయ్యింది… నేను మా చెల్లి , మా నన్నారు అప్పటికే Y సంవత్స్తరాల నుండీ ఆ కోవకి చెందిన వాళ్ళం అవ్వటం చేత …  మా అమ్మకి సలహాలు పడేస్తూ ఉండేవాళ్ళం.. ఇలా పెట్టుకో.. ఇలాoటిది కొన్నుక్కో అని… మేము అప్పటికే తనకి కళ్ళ జోడు రావడం వల్ల కుమారి భారతదేశం పదవి నుంచి విశ్రాంతి తీస్కోమని చాల వెటకారం చెయ్యడం వల్లనో .. మా నాన్నగారు కుడా తన కళ్ళ జోడు అనుభవం చెప్పడం వల్లనో కానీ … మేము కూడా వెంట వచ్చి మరీ కొనిపెడతాం అన్నా.. ససేమిరా అని తను ఒక్కతే వెళ్ళింది .. కళ్ళ జోడు షాపుకి..

మా అమ్మ ని చూడగానే ..  ” ఒరేయ్, ఆ కొత్తగా వచ్చిన మోడల్ పట్టుకు రా ” అని  వో కుర్రవాడిని పంపాడు మార్వాడి … ఆ షాపులో వెనక ఎవరూ ముట్టుకోని ….  ఒక గులాబీ రంగు ప్లాస్టిక్ ఫ్రేము డబ్బా బూజులు దులిపి పట్టుకు రమ్మని వీడి సీక్రెట్ కోడు …

మేడం, ఇదిగో ఇది బ్రాండ్ న్యూ మోడల్ … అని అమ్మకి చూపించి…  ఆ షాపు వాడు…  ఈ ప్రపంచాన్ని మా కళ్ళ జోడు తో చూస్తే నిత్య నూతనంగా ఉంటుందన్నాడుట… మా అమ్మ తెలివిగా.. మా ఆయినా , పిల్లలు వాడే మోడల్ ఇది కాదు అందిట …

“అవును మేడం ఇది లేటెస్ట్ .. కావాలంటే వాళ్ళని కూడా రమ్మనండి .. మేము మీకు కాబట్టి .. రేట్ కూడా హోల్-సేల్ రేట్ కి డిస్కౌంట్ చేసి ఇస్తాం” అన్నాడు షాపు వాడు.. తెలుగు డిక్షనరీ లో మా అమ్మకి నచ్చిన రెండే రెండు ఇంగ్లీష్ పదాలు …. హోల్-సేల్, డిస్కౌంట్ …

అవి చెవిన పడగానే మా అమ్మ… ప్యాక్ ఇట్ అంది.. అంతే… !

ఇంటికి వచ్చాక  ‘మయ సభ’ సీన్ లో ‘ఊర్వసి’ శారద లాగా మేము దుర్యోధనుడి పోర్షన్ లో మా అమ్మ …. అప్పటి నుంచీ తను కళ్ళ జోడు పెట్టుకోలేదు …  కానీ ప్రతి ఏడాది ఒక కొత్త ఫ్రేము లో అద్దాలు మాత్రం వేయిస్తూనే ఉంది… వేయించిన ప్రతి సారి మమ్మల్ని ఒపీనియన్ అడగటం.. మేము ఇచ్చిన సమాధానాన్ని బట్టి  … మా అమ్మ పెట్టుకోవడం మానెయ్యడం …. మేము అమ్మా కళ్ళజోడు పెట్టుకో అమ్మ అని బ్రతిమాలడం ఆనవాయితీ …

ఇప్పుడు మూడు ఏళ్ళ తరువాత మా చెల్లెలు పెట్టుకున్న ఫ్రేము బావుందంతోంది… అంటే…  మరో సారి ….కధ మొదటికి వచిందన్నమాట!

మాట పలుకు లేకుండా  ఫోన్ పెట్టేసి ఒక నిశ్చయానికి వచ్చేసాను… ఏదైతే అది అయ్యింది… ఈ సారి నా మనస్సుని చంపేసుకుని మరీ బావుందని చెప్పేస్తాను .. ఈ కధని కంచికి ఫ్లైట్ ఎక్కించి మరీ తోలేస్తాను … 😉

బుజ్జి పండు

జనవరి 31, 2010 Posted by | Shortstories | | 1 వ్యాఖ్య

గోవింద గోవిందా… కాషాయం పోయిందా … !

మా అమ్మ టైపిస్టుగా పి. ఆర్. ఓ  లో పని చేస్తుండగా యెన్. టీ. రామారావు గారు మన రాష్త్ర ( ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్) ముఖ్య మంత్రి. ఆయిన ఎప్పుడు కాషాయం వేసుకునే వారు.

ఆ రోజుల్లో అమ్మ ఒక కాషాయం రంగు గుడ్డ కొని నాకు మా చెల్లికి బట్టలు కుట్టించింది. ఖర్మమా! అని మేము అవి వేలాడు తీస్కుని వెళ్ళేవాళ్ళం. బేoడు మేళం లాగా ఉండేవాళ్ళం నేను మా చెల్లి ఆ పిచ్చి బట్టలలో. అది చాలనట్టు తను ఒక ప్లైన్ చీర కొనుక్కుంది అదే రంగులో . ఆ చీర మీద చీర ఒక ప్రింటు గానీ, కుట్టు గానీ లేదు. మీకు మాకు చిత్రంగా ఉన్నా.. మా అమ్మకి ఏనాడు ఇది తేడాగా అనిపించలేదు , ఈనాటికీ!  :O

బుధవారం వచ్చిందంటే నాకు గుండెల్లో గుబులు అంటే నమ్మండి. ఇద్దరికీ ఆ బట్టలు తగిలించి బడికి పంపుతుందేమో నని టెన్షన్ గా ఉండేది నాకు. 18  ఏళ్ళు రానిదే వోటు హక్కు లేనట్టు అప్పుడు నాకు చెల్లికి బీరువా హక్కు లేదు. మా అమ్మ ఏ బట్టలు ఇస్తే అవి వేస్కుకోవలసిందే.

నేను ఊహించిన సుభ గడియ రానే వచ్చింది అమ్మ ఆ డ్రెస్ తీసి మంచం మీద పెట్టింది. నేను ఆ డ్రెస్ వేసుకోకుండా ఉండేందుకు వెధవ ఆలోచనలు మొదలెట్టాను.పెరట్లోంచి అటే పారిపోదాం అనుకునాను పోనీ జ్వరం అని చెప్పేసి ఇంట్లో కూర్చుందాం అనుకునాను. కానీ నేను పెట్టుకున్నది ‘హిట్లర్’ తో కాదు మా అమ్మ తో…

నా పన్నాగాలు పారలేదు  సరికదా, నా వేషాలకి మా అమ్మ కి కోపం కూడా వచ్చింది. అమ్మకి కోపం వస్తే ముక్కు పుటలు ఎగరేసి ‘నాగిన్’ సినిమా లో శ్రీదేవి లా కనిపిస్తుంది. కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ అమురుతాయి. అమ్రేష్ పూరి బూర ఊడుతుంటే తను బుస కొడ్తునట్టు కనిపిస్తుంది. దెబ్బకి ట్టా దొంగల మూటా! అని కిక్కురు మనకుండా అమ్మ చెప్పిన డ్రెస్ వేస్కుని బొత్తాలు పెట్టుకుని స్కూల్ కి బయలుదేరాము.

మా స్కూల్ లో చాల మావిడి చెట్లు ఉండేవి కాన్వెంట్ గోడ అవతల. వేసవి కాలం అవ్వడం తో చెట్ల నిండా మావిడి కాయలు. అవి నన్ను ఆట పట్టిస్తునట్టు ఉండేది. గబగబా చెట్లెక్కి రెండు కాయలు కోసేసను. ఎవరో వస్తునట్టు అనిపించగానే గోడ దూకేసాను. అంతే! …. నేను కింద పడటం నా డ్రెస్సు చిరాగటం రెండూ ఒకే సారి జరిగి పోయాయి. కాలు మెలిక పడి నేను లేవలేని స్థితిలో మా చెల్లి నాకు సాయం పడ్తూండగా ‘చంద్రలేక’ ఇంకో టీచర్ పేరు గుర్తు లేదు ఆ ‘వరమని’ టీచర్ ఇద్దరు వచ్చి నన్ను లేపి, తిట్టి  నా చేతిలో ఉన్న మావిడి కాయలు పట్టుకెళ్లిపోయారు. మర్నాడు ఒకళ్ళు ‘మెంతి బద్దలు’ ఇంకొకళ్ళు ‘మావిడి కాయ పప్పు’ తెచ్చారని  స్టాఫ్ రూం దగ్గర తచ్చాడుతున్న మా గూఢచారి సమాచారం.మావిడి కాయలు పోతే పోయాయి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు డ్రెస్సు చిరిగింది ఇంకా ఎప్పటికి ఈ డ్రెస్సు వేసుకోవక్కర్లేదు అని గంతులేస్తూ ఇల్లు చేరాను. మా అమ్మ చేతిలో చివాట్లు తిన్నా ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు.

అంతకు మించిన ఆనందం ఇంకో రోజు కలిగింది. మా అమ్మ ఆ కాషాయం రంగు చీరని చాల ఏళ్ళు వాడాక దానికి అమీర్పేట్ లో నల్ల పూల ప్రింటు వేయించింది. అలా కూడా ఒక దశాబ్దం పాటు కట్టుకున్నాక ఓ రోజు మడికట్టుకోవడానికని  వాకిట్లో ఆరేసింది. ఎవడో దొంగ వెధవ ఆ చీరని పట్టుకుని చక్కా పోయాడు.  ఆహా!… ఇంకా నేను ‘స్వర్ణ కమలం’ సినిమా లో ముత్య్ల్లల అరుణ చెప్పినట్టు ‘గంతులే గంతులు’!

మునిపంటితో నా సంతోషాన్ని నొక్కి పెట్టి… అయ్యో! అమ్మా! కాషాయం రంగు చీర పోయిందా! బాధ పడకు మల్లి ఇంకోటి కొనుకోవచ్చులే అన్నా! 😛

కొసమెరుపు ఏమిటంటే మా అమ్మ నా డ్రెస్ రఫ్  (పిచ్చి పిచ్చి దారాలతో చెత్త కుట్లు వేసి బట్టల మీద ఉన్న చిల్లుని దాచే ప్రక్రియ) తీయించింది …. నాకు పొట్టయ్యి నేను కట్టుకోలెంత వరుకు నేను ఆ డ్రెస్ వాడల్సివచింది!! 😦


బుజ్జి పండు

జనవరి 31, 2010 Posted by | Shortstories | , | 6 వ్యాఖ్యలు

మొదటి మాట .. మొదటి పలకరింపు …

స్వాగతం సుస్వాగతం

అమ్మ అనే మాట ఒక ఉనివెర్సల్ టాపిక్ …. మొదటి మాట .. మొదటి పలకరింపునూ …. ఆవు వ్యాసం లాగా, నేను ఏం చేసినా చెప్పినా మొదటినో చివరనో మద్యనో మా అమ్మ ని చేర్చేస్తూ ఉంటాను… అదీ లెక్క …

తైతిరీయ  ఉపనిషత్తు దగ్గర నుంచీ మా అమ్మ వరుకు “మాతృ దేవో భవ” అని చెవినిల్లు కట్టుకుని పోరారు మహానుభావులంతా !

ఈ రోజుల్లో అంటే తిట్ల చాలీసా… భూతుల దండకం పిల్లలు హాయిగా కరెంటు పోయిన పోక పోయిన పాడుకోవచ్చు కానీ.. మా రోజుల్లో అల కాదు… పెద్ద వాళ్ళని కన్నెత్తి చూస్తే … హమ్మో … పెద్ద నేరం చేసాం అని తేల్చేసి వెయ్యేసి కోరాడ దెబ్బలు చెట్టుకో , కీటికీకో కట్టేసి కొట్టేసేది … ఇంకెవరు మా అమ్మే …. అదీ మా మంచికే అనుకోండి… కాకపోతే అప్పట్లో అనిపించేది కాదు మాస్టారు..

బాధలు పంచుకుంటే తరుగుతై అంటారు… అందు వలన చేత…  నేను ఈ పీజీలన్ని మా చిన్ననాటి అల్లర్లు, మా అమ్మ తిట్లు దీవెనలు .. ముఖ్యంగా .. మా అమ్మ కి మాకు జరిగిన (జరుగుతూన్న) మల్ల యుద్హాలు, ముష్హ్ట్టి (అచ్చు తప్పు క్షమించాలి ) యుద్ధాలు, వాగ్వివాదాలు .. అలాటివన్నమాట …. వీటితో నింపేసి..  మా అమ్మని తీరిక వేళ్ళల్లో నింపాదిగా చదువుకోమని కానుకగా ఇద్దాం  అనుకుంటునాను ..

ఇప్పుడైతే అమ్మ నా కంప్లైంట్ లిస్టు ని కంప్లిమెంటు లిస్టు గా తీస్కుని …  సరదాగానో , మేచుకోలుగానో వో నవ్వు విసిరేస్తుందని (నిజం చెపొద్దు …. ఇప్పుడైతే అమెరికా లో ఉన్నాను కనుక… తన చేతికి చవబాధడానికి  దొరకనని నా నమ్మకం 🙂 )

ఆల్ జోక్స్ అపార్ట్ ….

మా అమ్మ అంటే నాకు బోలెడు ఇష్టం..కానీ మా అమ్మ తో వేగడం చాల కష్టం …. ఒక మనిషిని నేను  ద్వేషిచేంతగా ప్రేమిస్తునాను అంటే మాత్రం అది ‘మా అమ్మ’  (యమోషన్ కాస్త ఎక్కువయ్యింది )

నా   ప్రతి పిచ్చి పని లోను ‘సయ్’ అంతే ‘సయ్’ అంటూ సాయం పట్టే మా చెల్లెమ్మ కూడా ఈ వృతాంతాలు వ్రాయడానికి సహకరిస్తుందని తలుస్తూ …

ఇట్లు మా అమ్మ

బుజ్జి పండు

అసలు పేరు అటుంచి… మా అమ్మ నన్ను పిలిచే పేరుతో వ్రాస్తే …. కనీసం జనాల్లో పరువు పోకుండా ఉంటుందని..  అందుకే ‘బుజ్జి పండు’ ఇహ నుంచీ నా ‘కలం పేరు’ 😀



జనవరి 31, 2010 Posted by | Shortstories | 3 వ్యాఖ్యలు